ఇటీవలి కాలంలో రైతులు ఆర్థికంగా లాభదాయకమైన వృక్ష జాతుల వనాలను పెంచడం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అటవీ వ్యవసాయ పద్ధతులలో ఒక అంతర్గత అంశంగా వారు దీన్ని భావిస్తున్నారు. అలాంటి చెట్ల పెంపకంలో చందనం చెట్లు ఒకటి. గంధం చెక్కలు ఎక్కువ ధర పలుకుతాయి కనుక రైతులతోపాటు కంపెనీలవారు కూడా గంధం చెట్ల పెంపకం పట్ల దృష్టిని కేంద్రీకరించడం  పెరుగుతోంది. ప్రపంచంలో ఈస్ట్  ఇండియన్ గంధం చెక్కల ఉత్పత్తిలో  భారతదేశానిదే  90%  వాటా.  ఈ రకం గంధం చెక్కల ప్రధాన ఎగుమతిదారుగా ఇండియా అవతరించింది. ఈ గంధం చెక్కలలో చాలా భాగాన్ని ఆ చెట్లు సహజంగా పెరుగుతున్న చోట్ల నుంచే సేకరిస్తున్నారు. ప్రస్తుతం గంధం చెట్లే గొడ్డలి వేటుకు ఎక్కువ బలవుతున్నాయి. గంధం చెక్కల ఎగుమతి ఎక్కువ సొమ్మును తెచ్చిపెట్టడం వల్ల  వాటిని విచక్షణారహితంగా నరికేస్తున్నారు. కొత్త చెట్ల పెంపకం చెప్పుకోతగినంతగా ఉండడం లేదు. అడవుల్లో  మొదలయ్యే కార్చిచ్చుకు, చీడపీడలకు మరికొన్ని చెట్లు మాయమవుతున్నాయి. భూ వినియోగ తీరులో మార్పు కూడా ఆ చెట్లకు బతుకు భారం చేస్తోంది.
…ఏటా గంధం చెక్కల ఉత్పత్తి  400 నుంచి 500 టన్నుల వరకు తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా గంధం చెక్కలకు డిమాండ్ మాత్రం 5000 నుంచి 6000 టన్నుల మధ్య ఉంది. చందన తైలానికి 100-120 టన్నుల డిమాండ్ ఉంది.
(గంధం చెట్ల సంరక్షణ, మెరుగుదల, పెంపకం, నిర్వహణపై జాతీయ సదస్సు వివరాలు (ఎడ్స్ గైరోలా, ఎస్. తదితరాలు), 12-13 డిసెంబర్ 2007, పిపి. 1-8)
సహజంగా దొరికే గంధం చెక్కలు తగ్గిపోతుండడం వల్ల జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధర ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఇక ఈస్ట్ ఇండియన్  గంధం చెక్కలైతే మరింత వ్యాపార విలువను సంతరించుకుంటూ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి.
ఈస్ట్ ఇండియన్  గంధం చెక్కలు  (శాంటలమ్ ఆల్బమ్ )  చక్కని సువాసనకు ప్రసిద్ధి చెందిన విలువైన గంధం చెక్కలలో ఒకటి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు రెండింటిలోనూ వాటి వాణిజ్య విలువ చెప్పనలవి కాదు. రకరకాల వాతావరణ పరిస్థితులకు, ఇతర ఆసరా చెట్లకు అనుగుణంగా  ఈ చెట్లు పెరగ్గలవు.  చుట్టుపక్కల చెట్ల కణజాలం నుంచి బలం పుంజుకుంటాయి.  భూమిని బట్టి పెరుగుతూ పోగలవు.  దీంతో వ్యాపార దృష్టితో వీటిని పెంచేందుకు రైతులు, కంపెనీలవారు ఆసక్తి కనబరుస్తున్నారు.
చందనం పాక్షిక పరాన్న వేర్లు కలది. పరాన్న జీవుల జీవావరణాన్ని అర్థం చేసుకోవడంపైనే గంధం చెట్ల వనాలను విజయవంతంగా ఏర్పాటు చేయడం ఆధారపడి ఉంటుంది.  ముఖ్యంగా ఆసరాగా నిలిచే చెట్లకు పరాన్న జీవి అయిన గంధం చెట్టుకు మధ్య సంబంధాలను చూడాలి. వాటి నిష్పత్తిని, చెట్ల పెంపకానికి సంబంధించిన ఇతర మెళకువలను గ్రహించాలి.  ఖనిజ పోషకాలు, నీటి కోసం గంధం చెట్లు ఇతర చెట్లపై ఆధారపడతాయి. వాటిని ఆసరా చెట్లుగా పిలుచుకోవచ్చు. పరాన్నజీవి మొక్కలలో కనిపించే ప్రత్యేక రకాల మూలాల ద్వారా గంధం చెట్లు ఆ పని చేస్తాయి. ఈ మూలాలు గంధం మొక్కకి ఇతర ఆసరా చెట్లకి మధ్య మానసిక వారధిగా పనిచేస్తాయి. గడ్డి మొక్కల నుంచి చెట్ల వరకు రకరకాల చెట్లపైన గంధం చెట్లు పరాన్న జీవిగా బతుకుతాయి. లెగూమినస్ చెట్లతో వీటికి అనుబంధం ఎక్కువ. వేర్లు భూమి లోపలికి బాగా చొచ్చుకుపోయి, నెమ్మదిగా పెరుగుతూ నిరంతరంగా ఆసరాగా వ్యవహరించగల వృక్షజాలం  గంధం చెట్లు స్థిరంగా వృద్ధి చెందడానికి సహాయపడతాయి. కాండం లోపల మెరుగైన కలప, తైలం రావడానికి ఎవరైనా సరే గంధం చెట్లను 15 ఏళ్ళకి పైగా పెంచాల్సి ఉంటుంది. చెట్ల మార్పిడికి సర్వోన్నత వయసుగా 25-30 ఏళ్ళని చెప్పవచ్చు.
ఇండోనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో, హవాయి, ఇతర పసిఫిక్ దీవుల వంటి అనేక ప్రాంతాలలో గంధం చెట్లు సహజంగా పెరుగుతున్నాయి.  ఆస్ట్రేలియా, ఇండియాలలో కూడా ఇవి సుపరిచితం. ఇండియాలో పెరిగే గంధం చెట్ల తైలానికి, గంధం చెక్కలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కువ విలువ ఉంది. వీటిని ఈస్ట్ ఇండియన్ గంధపు చెక్కలుగా వ్యవహరిస్తూంటారు. పసుపు రంగులో ఉండే పరిమళ చందన తైలాన్ని చెట్టు కలప, వేర్ల నుంచి కూడా తీస్తుంటారు. గంధం చెక్కలతో చేసిన వస్తువుల్లో దాని తాలూకు సువాసన కొన్ని దశాబ్దాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఒక రకంగా సతత హరిత వృక్షం. కానీ, నెమ్మదిగా పెరుగుతుంది.  ఒకటి నుంచి 2.5 మీటర్ల  వెడల్పు కాండంతో సుమారుగా 10 నుంచి 15 మీటర్ల వరకు పెరుగుతుంది.  మార్కెట్లో అమ్మడానికి అనువుగా తయారవడానికి దాదాపు 15 ఏళ్ళు పడుతుంది. అయితే, ఎరువులు వంటివి వేసి పెంచుతున్నపుడు వ్యాపార విలువను సంతరించుకోవడానికి గంధం చెట్టుకు దాదాపు 20 ఏళ్ళు పడుతుంది. ఆకులు మృదువుగా ఉండి,  కాండానికి ఇరువైపులా జతగా పెరుగుతాయి. మందంగా పెరిగిన ఆకులు నీలం నుంచి ఆకుపచ్చ, పసుపు రంగులు కలిసినట్లు ఉంటాయి. లేత ఆకులు లేత గులాబీ, ఆకుపచ్చ రంగులు కలిసినట్లుగా ఉంటాయి. మొత్తంమీద గంధం చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది. యువ చెట్ల బెరడు ఎరుపు, గోదుమ కలగలసిన రంగులో మృదువుగా ఉంటుంది. పెరిగిన చెట్ల బెరడు ముదురు గోధుమ రంగులో లోతైన నిలువు చీలికలతో ఉంటుంది. గంధం చెట్టుని పాక్షిక పరాన్న జీవి చెట్టుగా చెప్పాలి. ఇతర రకాల చెట్ల వేర్ల నుంచి ఇది కొంత బలాన్ని తీసుకుంటుంది. గంధం చెట్టు వేర్లు  విస్తారంగా వ్యాపించి దగ్గరలో ఉన్న చెట్ల వేర్లతో చుట్టుకుపోయి నీటిని, పోషకాలను సేకరించుకుంటాయి. నేల ఉన్న ఎత్తును బట్టి చెట్టు పువ్వులు పూయడం ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతున్న చెట్లతో పోలిస్తే, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో పెరుగుతున్న గంధం చెట్లు ఒక నెల ముందుగా పువ్వులు పూస్తాయి. మొదట్లో ఇవి పసుపు రంగులో ఉండి, తర్వాత ముదురు ఊదా, గోధుమ రంగుల మిశ్రమంగా మార్పు చెందుతాయి. మొగ్గ దశ నుంచి పువ్వుగా మారడానికి నెల పడుతుంది. కాయ ప్రారంభ దశ నుంచి పండుగా మారడానికి మూడు నెలలు పడుతుంది. పర్యావరణ, వాతావరణ పరిస్థితులు జతకూడిన కొన్నిచోట్ల గంధం చెట్లు బాగా పెరుగుతాయి.
గంధం చెట్టు శాస్త్రీయ నామం శాంటలమ్ ఆల్బమ్. శాంటలేసియా ఏఇ అనే కుటుంబానికి చెందిన చెట్లు ఇవి.
అంతర్జాతీయ వర్తకంలో కనిపించే ప్రధాన గంధం చెట్ల రకాలు:
శాంటలమ్ ఆల్బమ్ (ఈస్ట్ ఇండియన్ శాండల్ వుడ్)-ఇండోనేసియా, ఇండియాలలో పెరుగుతాయి. ఆస్ట్రేలియా ఉత్తర కొసన సహజంగా పెరుగుతాయని భావిస్తున్నారు. చారిత్రకంగా, అంతర్జాతీయ వర్తకంలో ఎక్కువ ఆదరణ చూరగొంటున్నదిగా శాంట ఆల్బమ్ కు పేరుంది. సహజంగా పెరిగే ప్రాంతాల్లో ఈ రకం చెట్లు ఇపుడు వాణిజ్యానికి అందుబాటులో లేవు. భవిష్యత్తులో వీటి సరఫరా చాలా వరకు ఆస్ట్రేలియా ఉత్తర భాగం నుంచే కొనసాగనుంది. (ఆసియాలోని అనేక ఉష్ణ దేశాలలో ఏర్పాటు చేసిన చందన వనాల నుంచి కూడా సరఫరా జరగనుంది).
ఎస్. స్పికాటమ్ (ఆస్ట్రేలియన్ శాండల్ వుడ్)- ఆస్ట్రేలియాలో నైరుతి దిశలో పెరుగుతాయి. ఇటీవలి దశాబ్దాలలో వర్తకంలో ఈ రకం గంధం చెక్కల ప్రాబల్యమే ఎక్కువ. పశ్చిమ ఆస్ట్రేలియా అధికారులు సుస్థిరమైన శ్రద్ధాసక్తులతో వీటి పెంపకాన్ని నిర్వహిస్తుండటం దానికి కారణం. అయితే, ఇవి చందన తైలానికి పేరెన్నికగన్నవి కావు. వీటిలో శాంటలోల్స్ మోతాదులు తక్కువ. ఇ, ఇ పార్నిసోల్ స్థాయిలు ఎక్కువ. కానీ, అగరత్తులు, దారు శిల్పాలు లాంటివి తయారు చేయడానికి అనువైనవి.
ఎస్. ఆస్ట్రోకాలిడోనికమ్ (శాండల్ వుడ్)- న్యూ కెలడోనియా, వాన్వాటులలో కనిపిస్తాయి. ఈ గంధం చెట్ల తైలం ప్రమాణాలలో తేడాలున్నాయి. (వాన్వాటులోని శాంటో, మేల్కులా గంధం చెట్లు, న్యూ కెలడోనియాలోని  ఐల్ ఆఫ్ పైన్స్ గంధం చెట్ల) తైలం అత్యంత ఉన్నతమైనదిగా గణన పొందుతోంది. ఇవి గుణగణాలలో  ఈస్ట్ ఇండియన్ శాండల్ వుడ్ తైలంతో సరితూగేవిగా పేరుతెచ్చుకున్నాయి.
ఎస్. వసి (వసి లేదా అహి)- ఫిజీ, టోంగా, న్యూయేలలో కనిపిస్తాయి. ఈ చెట్లు సాధారణంగా ఉత్కృష్టమైన ప్రమాణాలతో కూడిన గంధం చెక్కలను, తైలాన్ని అందిస్తాయి. ఈస్ట్ ఇండియన్ శాండల్ వుడ్ కి భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు ఇవి సరితూగుతాయి. అయితే, పరిమిత విశ్లేషణ ప్రకారం, వీటి తైలంలో ఇ, ఇ ఫార్నిసోల్ స్థాయి దాదాపుగా 2-3 శాతం ఉందని తేలింది. సందేహాస్పద చర్మ ఎలర్జీ కలుగుజేసేవిగా అవి ముద్ర పడడంతో, యూరప్ లో పరిమళ ద్రవ్యాలు, చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఎస్. వసి తైలం వాడకం పరిమితంగానే ఉండవచ్చు.
ఎస్. పానికులాటమ్ (ఇల్యాహి)- హవాయిలో కనిపిస్తాయి.
గంధపు చెట్ల పెంపకం
గంధపు చెట్లకు అనువైన పరిస్థితులు. వర్షపాతం ఒక మోస్తరుగా ఉండే ప్రాంతాలు. సూర్యరశ్మి పూర్తిగా ఉండాలి.  ఏడాదిలో చాలా వరకు పొడి వాతావరణం ఉండాలి. వాతావరణం ఎండగా ఉండే ఉష్ణ, ఉప-ఉష్ణ ప్రాంతాల్లో ఇవి బాగా పెరుగుతాయి. ఇసుక, ఎర్రమట్టి, నల్లరేగడి వంటి వివిధ రకాల నేలల్లో గంధపు చెట్లు బాగా పెరుగుతాయి. ఎరుపు ఫెరూజినస్ లోమ్ భూములు ఎక్కువ అనువైనవి. హైడ్రోనియం అయాన్లు, హైడ్రాక్సైడ్ అయాన్ల మధ్య నిష్పత్తి  6.0 నుంచి 7.5 మధ్య ఉంటే మంచిది. కంకర, రాతి నేలలు, గాలులు బలంగా వీచే చోట్లు, తీవ్ర ఉష్ణోగ్రత, దుర్భిక్ష పరిస్థితులను గంధపు చెట్లు తట్టుకోగలవు.  సూర్యరశ్మిని ఎక్కువ కోరుకునేవే అయినా, కొంతవరకు నీడపడే చోట్ల కూడా ఇవి పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండి, వార్షిక వర్షపాతం 825 మిల్లీమీటర్ల నుంచి 1175 మిల్లీమీటర్ల వరకు ఉండే చోట్ల ఇవి బాగా బతుకుతాయి. గంధపు చెట్లు సున్నితమైనవి. నీటి మడుగులను ఇవి సహించలేవు. గంధపు చెట్లు సక్రమంగా, పూర్తిగా పెరగడానికి సముద్రమట్టానికి 1960 నుంచి 3,450 అడుగుల ఎత్తున ఉండే ప్రాంతాలు బాగా పనికొస్తాయి.
ఇతర వనాల మాదిరి కాకుండా, గంధపు చెట్లు పెరగడానికి సరైన నేలలు అవసరం. సూర్యరశ్మి బాగా ఉండి, ఉత్తరం నుంచి పశ్చిమాభిముఖంగా ఉన్న వాలు ప్రాంతాలు అనుకూలమైనవి. నీరు నిల్వ ఉండకుండా సాఫీగా సాగిపోయే నేలలైతే మేలు. గంధపు మొక్కలు నాటేచోట నేలను 40 సెంటిమీటర్ల లోతు వరకు తవ్వాలి. భూమి లోపలికి వేర్లు బాగా చొచ్చుకుపోయే విధంగా రెండుసార్లు లోతుగా తవ్వి భూమిని సిద్ధం చేయాలి. చివరిసారి దున్నేటపుడు ఆకులు అలాలు వంటి సేంద్రియ గత్తను తగినంత మోతాదులో జోడించాలి. నేల నుంచి కలుపు మొక్కలన్నింటిని తొలగించాలి. తగిన ఆసరాగా వ్యవహరించ గలవనుకున్న చెట్లను వదిలేయాలి.
విత్తనాలు నాటడం లేదా అంటుకట్టడం ద్వారా గంధపు చెట్లను నాటవచ్చు. విత్తనాలు వేయదలచుకుంటే 15-20 ఏళ్ళ వయసున్న చెట్ల విత్తనాలు సేకరించాలి. విత్తనాలను 24 గంటలపాటు నీటిలో నానబెట్టి తర్వాత ఎండలో ఆరబోయాలి. అపుడు విత్తనంపైన పెంకు పగిలి, విత్తనం మొలకెత్తడం తేలిక అవుతుంది.
కొమ్మలు తెచ్చి అంటుగట్టవచ్చు లేదా వేర్లను కత్తిరించి వేసుకోవచ్చు. వీటిని కాయక ప్రవర్థనం అంటారు. వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న గంధపు మొక్కలు చాలా భాగం ఉమ్మడి కణాల ప్రవర్థనం ద్వారా వచ్చినవి. టిష్యూ కల్చర్ పద్ధతి తేలిక. ఇది సుమారు 60 శాతం సఫలత రేటును చూసింది. అంటుకట్టే విషయంలో కాలం ముఖ్యం. మే నెలలో అంటుకట్టినవాటికన్నా ఏప్రిల్ మొదట్లో అంటుకట్టినవి బాగా వృద్ధి చెందిన సందర్భాలున్నాయి.
గంధం చెట్లు ఆధారపడడానికి వీలుగా  వాటికి తోడ్పడే చెట్లను ముందే వేసి ఉంచాలి. తుమ్మ, సర్వీ, కజేనస్, క్రోటన్ వంటి వాటిని ముందే వేస్తే గంధపు మొక్కల వేర్లు వాటి వేర్ల నుంచి సారాన్ని గ్రహిస్తాయి.
45 x 45 x 45  సెంటిమీటర్ల కొలతలు కలిగిన గోతులు తవ్వాలి.  వాటి మధ్య  2.6x 2.6 లేదా 5×5 మీటర్ల ఖాళీ జాగా వదలాలి. ఎకరానికి సుమారుగా 400 నుంచి 650 గంధపు మొక్కలు వేసుకోవచ్చు. ప్రతి గోతిని 1:2  నిష్పత్తితో ఎర్రమట్టి, సేంద్రియ ఎరువుతో నింపాలి. ప్రతి వరుసలోను సుమారుగా ప్రతి ఐదవ గంధపు మొక్క వద్ద దీర్ఘకాలం మనగలిగే మరో చెట్టును నాటాలి. గంధపు మొక్కకు ప్రతి 150 సెంటిమీటర్ల దూరంలోను మధ్యవర్తిగా ఉండే విధంగా ఏదోఒక మొక్కను నాటాలి. అయితే, ఆ మొక్క గంధపు మొక్కకన్నా పొడవుగా ఉండకూడదు. కనుక, దాన్ని క్రమం తప్పకుండా కురచ చేస్తూ ఉండాలి. అలాగే, 6 నుంచి 8 నెలల వయసున్న లేదా సుమారు 30 సెంటిమీటర్ల కన్నా పొడవు ఉండని గంధపు మొక్కలు నాటుకోవాలి. గంధపు మొక్కలు గోదుమ రంగు కాండంతో ఉండి,  కొమ్మలు బాగా వచ్చినవై ఉండాలి.
వర్ష ఆధారిత నేలల్లో గంధం మొక్కలు బాగా పెరుగుతాయి. వేసవిలో మాత్రం తడి పెట్టవలసిరావచ్చు. వేసవిలో ప్రతి 2 లేదా 3 వారాల కొకసారి గంధపు మొక్కల మంచిచెడులపై దృష్టి సారించాలి. మండుటెండలుకాసే రోజుల్లో తేమను కాపాడుకోవడంలో భూమికుండే సామర్థ్యాన్ని బట్టి బిందు పద్ధతిలో మొక్కలకు నీటిని సమకూర్చవచ్చు. డిసెంబర్ నుంచి మే వరకు మొక్కల ఆలనపాలన చూసుకోవాలి. గంధపు మొక్కలు తమ పోషకాలలో చాలా వాటిని ఇరుగుపొరుగు మొక్కల నుంచి లాగేసుకుంటాయి కనుక ఎరువులు ఏమంత అవసరం లేకుండానే బతికేస్తాయి. అయితే, ఆకుపెంట, సేంద్రియ ఎరువులు, గత్త వంటివి గంధపు మొక్కల పెరుగుదలకు సాయపడగలవు.
మొదటి ఏడాదిలో కలుపు మొక్కలు అసలు లేకుండా చూసుకోవాలి. తర్వాత, మధ్య మధ్యలో కలుపు మొక్కలను పీకేస్తే సరిపోతుంది. పోషకాలు, భూమి తడి నష్టపోకుండా నివారించుకోవడంలో ఇది సాయపడుతుంది. అదనపు ఆదాయం కోసం రైతులు అంతర పంటలు వేసుకోవచ్చు. తద్వారా భూమిని వీలైనంత ఉపయోగించుకోవచ్చు. భూసార నిర్వహణ చేసుకోవచ్చు. వేర్లు బలంగా లేకుండా తక్కువ వ్యవధిలో అందివచ్చే వాటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు.
గంధపు చెట్లు రకరకాల కీటకాల బారినపడే అవకాశం ఉంది. కానీ, వాటిలో కొన్ని కీటకాలు మాత్రమే గంధపు చెట్టు ఆర్థిక విలువను క్షీణింపజేయ గలుగుతాయి. తెగుళ్ళు చాలా భాగం మొక్కలుగా ఉన్నపుడే సోకుతాయి. చీడపురుగులు కూడా ప్రారంభ దశలో మాత్రమే నష్టపరచగలుగుతాయి.
గంధపు మొక్కలు అందొచ్చే కాలం
గంధపు చెట్టు 15 ఏళ్ళు ఆ పైచిలుకుకు చేరుకున్నపుడు దాన్ని అమ్ముకునే ఆలోచన చేయాలి. 30 ఏళ్ళు పైబడిన చెట్లలో బెరడు లోపల కలప బాగా గట్టిపడి ఉంటుంది. అది 40 నుంచి 60 సెంటిమీటర్ల చుట్టుకొలతకు చేరుకుంటుంది. 50 నుంచి 60 సెంటిమీటర్ల చుట్టుకొలత ఉన్న చెట్టు నుంచి 20 నుంచి 50 కేజీల బరువుండే గంధం చెక్కలను తీయవచ్చు. కోర్ వెలుపలి భాగాన్ని, వేర్లను కొమ్మలను తీసేస్తే , అచ్చపు గంధపు కలప చేతికొస్తుంది. గంధపు వనాలు పెంచుతున్న కొందరు వాణిజ్య రైతులు చెట్టు చుట్టుకొలత 15 నుంచి 25 సెంటిమీటర్లకు విస్తరించి, చెట్టుకు 10 నుంచి 12 ఏళ్ళు రాగానే వాటిని నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు. యువ చెట్ల నుంచి తీసే తైలం సాధారణంగా తక్కువ శ్రేణికి చెందినదై ఉంటుంది. 13 ఏళ్ళ వయసున్న చెట్లలో 12 శాతం ఉన్నత శ్రేణి కలప, 28 ఏళ్ళ వయసున్న చెట్లలో 67 శాతం ఉన్నత శ్రేణి కలప లభిస్తుంది. సుగంధ తైలాల విలువ వాటిని తీసిన చెట్ల మన్నిక, శ్రేణిపై ఆధారపడి ఉంటుంది. గంధపు చెట్లు ఎంత ఎక్కువ వయసున్నవైతే వాటి నుంచి తీసే కలప, తైలాలు అంత ఉత్తమమైన, నాణ్యమైన రీతిలో ఉంటాయి.
సాధారణంగా భూమి నుంచి 130 సెంటిమీటర్ల ఎగువున ఉండి, 13 సెంటిమీటర్ల చుట్టుకొలత కలిగిన చెట్టు మొండాన్ని ఎంచుకుంటారు. మొండెం వ్యాసార్థంలో బెరడు ఆరింట ఒకటో వంతుకన్నా తక్కువగా ఉండేట్లు చూసుకుంటారు. కూలిన లేదా జీవం లేని చెట్ల కలపలో కూడా తైలాలు చాలా కాలంపాటు ఉంటాయి. ఆ రకం చెట్లు ఏ పరిమాణంలో ఉన్నవైనా సరే వాటి నుంచి తైలాన్ని తీయవచ్చు. విరిగిన కొమ్మలు, కలప ధూళిని అగరవత్తుల తయారీలో  ఉపయోగిస్తారు.
దిగుబడి:  బెరడు లోపల సిసలైన కాండం తయారవడానికి కనీసం 10 నుంచి 12 ఏళ్ళు పడుతుంది. ఆ విధంగా చూస్తే గంధం చెట్లు నెమ్మదిగా ఎదిగే చెట్ల కోవలోకి వస్తాయి. వాతావరణ, భూసార పరిస్థితులు అనుకూలంగా ఉండి, పెంపకం పట్ల శ్రద్ధాసక్తులు వహిస్తే గంధపు చెట్ల చుట్టుకొలత ఏడాదికి  4 సెంటిమీటర్ల నుంచి 5 సెంటిమీటర్ల వరకు పెరుగుతుంది.
గంధపు చెట్ల వనాల పెంపకంలో వ్యయ వివరాలు:
ఒక ఎకరం భూమిలో గంధం చెట్ల పెంపకానికి అవసరమయ్యే పెట్టుబడి, నిర్వహణ తీరుతెన్నులు.
ఈ సంఖ్యా వివరాలు సూచనప్రాయమైనవి మాత్రమే. మార్కెట్ డిమాండ్ ను బట్టి తేడాపాడాలుండవచ్చు.
గ్రిడ్ పరిమాణం: 2.6 మీటర్లు  x 2.6 మీటర్లు
ఎకరానికి మొత్తం చెట్లు: 650
మధ్యలో కొన్ని చెట్లు చనిపోయినా భర్తీ చేసుకునేందుకు వీలుగా  కొనుగోలు చేయాల్సిన మొక్కల సంఖ్య: 750
ఒక చెట్టుకి అయ్యే వ్యయం (గంధపు మొక్క, ఆసరా చెట్టు, మౌలిక ఎరువులు, ఆకులు అలాలు వంటివి): ₹ 1000/-
ఒక మొక్క గొయ్యికి: : ₹ 150/-
బిందు సేద్య ఏర్పాటుకు: ₹200,000/-
ఎకరం వనం ఏర్పాటుకయ్యే మొత్తం వ్యయం: సుమారుగా ₹10,50,000/-
వన వార్షిక నిర్వహణా వ్యయం (కత్తి రింపులు, కూలీ, ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి వంటివి): ₹6,50,000/-

 

గంధపు చెట్లను వాటి  15వ ఏట అమ్మదలచిన పక్షంలో మొత్తం ప్రాజెక్టు వ్యయం: ₹1,08,00,000/-
వన భద్రతకయ్యే వ్యయాన్ని ఇందులో లెక్కలోకి తీసుకోలేదు. చెట్లు తైలాన్ని ఇవ్వడం మొదలెప్పినప్పటి నుంచి వాటి సెక్యూరిటీ చూసుకోవడం అవసరమవుతుంది. అనాది నుంచి గంధం చెక్కలకు అపహరణ బెడద ఉంది.  వీరప్పన్ వంటి స్మగ్లర్లు కూడా పుట్టుకొచ్చారు. దాంతో గంధపు చెట్ల వనాలకు సెక్యూరిటీ తప్పనిసరి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితులలో ఉమ్మడి/సాముదాయిక పెంపకం పథకాలు మరింత ఆకర్షణీయమైనవిగా మారాయి. ఖర్చుల పంపకం ఉంటుంది. ఫలితంగా సెక్యూరిటీకయ్యే హెచ్చు వ్యయం తగ్గుతుంది.
సగటున 15 ఏళ్ళలో చెట్టుకు బెరడు లోపల సిసలైన గంధపు కాండం బరువు 10 కిలోల వరకు పెరగవచ్చు. నేల, వాతావరణ పరిస్థితులు బాగుండి, ఉత్తమ పెంపకం విధానాలను అనుసరిస్తే  ఎకరానికి 6.5 టన్నుల గంధపు చెక్క లభించవచ్చు. ఎకరా గంధపు చెట్ల వనం నుంచి నేటి ధరవరల ప్రకారం రాబడి సుమారుగా రూ. 4,.90,00,000 ఉండవచ్చు. అంటే, రైతుకు 15 ఏళ్ళలో ఎకరానికి రూ. 3.8 కోట్ల నికర లాభం వస్తుంది.
అంతర్జాతీయ గంధపు చెక్కల మార్కెట్ కళకళలాడుతోంది.  కిలో శాంటలమ్ ఆల్బమ్ తైలం (దుబాయ్ ద్వారా లైసెన్సు రహిత ఉత్పత్తి) ధర ప్రస్తుతం సుమారుగా రూ. 1,30,000 నుంచి రూ. 1,60,000 వరకు ఉంది. (ఇండియా నుంచి లైసెన్సు సహిత ఉత్పత్తి) కిలో చందన తైలం ధర రూ. 1,85,000 వరకు ఉంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్  ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పేరుతో ఒక సంస్థ ఉంది. అది భారత ప్రభుత్వపు , అటవీ మంత్రిత్వ శాఖకు చెందినది. ఆ కౌన్సిల్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో మరో సంస్థ పనిచేస్తోంది. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రకారం:
బెరడు లోపలి ఫస్ట్ క్లాస్ భారతీయ గంధపు కలప కిలో ధర ప్రభుత్వ రేటు ప్రకారం ప్రస్తుతం రూ. 7,500గా ఉంది. చందన తైలం కిలో ధర రూ. 1,50,000గా ఉంది. దేశీయ మార్కెట్ లో గంధం చెక్క కిలో ధర రూ. 16,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు దేశీయ మార్కెట్ కన్నా సుమారు 15 నుంచి 20 శాతం ఎక్కువగా ఉన్నాయి. వార్షిక ధర పెంపు 25 శాతం పైగా ప్రీమియంతో ఉంది.
గంధపు చెక్కల భవిష్యత్తు:
బరువు గంధపు చెక్కలు కొన్ని విశిష్టమైన, హెచ్చు విలువతో కూడిన అంతిమ వినియోగాలను సంతరించుకుని ఉండటం వల్ల వాటికంత ధర. వివిధ ప్రాంతాల్లో, వివిధ మార్కెట్ విభాగాల్లో వాటికి గిరాకీ కొనసాగుతోంది. మేలిమి పరిమళాలలో వీటిని దినుసుగా వాడతారు. ఇంకా ప్రత్యేకమైన, సహజసిద్ధమైన చర్మ రక్షణ ఉత్పత్తుల్లో. నూతన ఔషధాలలో. ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా మార్కెట్లలో, సాలిడ్ ఫర్నిచర్, దారుశిల్పాలు. చైనా, జపాన్, కొరియాలలో సంప్రదాయ మందుల్లో. మతపరమైన కార్యక్రమాల్లో. ఇండియాలో అత్తర్ల తయారీలో. దహన సంస్కారాల్లో. పొగాకుతోపాటు నమలడానికి. మధ్య ప్రాచ్యంలో అలవాటైన వాటిలో.
ప్రపంచ వ్యాప్తంగా చందన తైలానికి డిమాండ్  ఇంకా పెరుగుతుందని 2014లో జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చందన తైలానికి డిమాండ్ సుమారుగా 10,000 మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఒక్క చైనాకే 2040 నాటికి 5000 మెట్రిక్ టన్నుల చందన తైలం అవసరమని అంచనా. డిమాండ్ కి సరఫరాకి మధ్యనున్న ఈ వ్యత్యాసం కారణంగా, గంధం చెక్కల ధర ఏటా 25 శాతం పైగా పెరుగుతూ పోతుందని భావిస్తున్నారు. గంధం చెట్టులో ఏదీ వృధాగాపోదు. రంపపు పొడిని కూడా అమ్ముతారు. ప్రభుత్వం ప్రస్తుతం నిబంధనలను కూడా కాస్త సడలించింది. గంధపు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. కనుక, గంధపు వనాలను ఏర్పాటు చేసే ఆలోచన చాలా లాభదాయకమైన వ్యాపార ప్రతిపాదనగా కనిపిస్తోంది.